Bandi Sanjay | నెలరోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే

Bandi Sanjay | నెలరోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే

లేకుంటే ప్రజాప్రతినిధులతో పరేడ్
కాంగ్రెస్ సర్కార్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ డెడ్ లైన్
పార్టీ గుర్తులతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా వచ్చేది కాదు


Bandi Sanjay | కరీంనగర్, ఆంధ్రప్రభ : రాబోయే నెల రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్ లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇవాళ‌ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా గెలుపొందిన బీజేపీ సర్పంచ్ ల‌ను ఘనంగా సన్మానించారు.

అనంతరం మాట్లాడుతూ… నిధులను మంజూరు చేసిన తరువాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, (MPTC, ZPTC) మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో నిధుల విడుదలలో జాప్యం చేస్తే కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచులను గెలిపించిన గ్రామాలను అన్ని విధాలా అభివ్రుద్ది చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.

ప్రజాభిమానంతో 108 మంది సర్పంచులు…

ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ హృదయ పూర్వక అభినందనలు. సర్పంచ్ గిరి చేయాలంటే ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారం తప్పనిసరి. ఈ ముగ్గురు కలిసి ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యమ‌న్నారు. మీ గెలుపు కోసం కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలు, సీనియర్ నాయకులు (Senior leaders) అంతా కలిసి కృషి చేశారు. వీళ్లందరి కృషివల్లే 108 మంది సర్పంచులు బీజేపీ మద్దతుతో గెలిచారు. దాదాపు 100 స్థానాల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచారన్నారు.

సర్పంచ్, ఉప సర్పంచ్ అంటే పదవి కానే కాదు. ప్రజలు మీకిచ్చిన బాధ్యత మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ప్రజలకు ఆపదొస్తే, కష్టమొస్తే ఆదుకునే తండ్రి బాధ్యత సర్పంచ్ లదేన‌న్నారు. డాక్టర్లు, అధికారుల (Doctors and officials) తో సత్సంబంధాలు పెంచుకోవాలి. మీ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుండాలన్నారు. చిరునవ్వుతో పలకరించడమే కాకుండా నడక, నడతలో మంచి తనం ఉండాలి. బీజేపీ గ్రామ సర్పంచ్ అంటే… ఇతర గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించాలి. బాసిజం చేయాలని చూస్తే ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్లేనని గుర్తుంచుకోండి.

అడ్డగోలు హామీలు ఇస్తే ఇబ్బంది పడతారు…

అడ్డగోలు హామీలిస్తే ఇబ్బందుల్లో పడతారు. గ్రామాల్లో మొదట చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నయాపైసా ఇయ్యలే. రాబోయే కాలంలో నిధులిస్తుందనే నమ్మకం కూడా లేదు. అంతో ఇంతో నిధులిచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేది కేంద్రమేన‌న్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ (Congress party) కి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ విషయం తెలిసే పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గెలిచిన వాళ్లంతా కాంగ్రెసోళ్లేనని గంప కింద కమ్మేస్తోందన్నారు.

ఇకపై బీజేపీ (BJP) సర్పంచులున్న 108 గ్రామాల అభివృద్దికి నా మొదటి ప్రాధాన్యత. ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఆయా గ్రామాలను తీర్చిదిద్దుతాన‌న్నారు. ఎంపీ లాడ్స్ తోపాటు సీఎస్సార్ ఫండ్స్ తీసుకొస్తా. ప్రతి గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ప్రతి స్కూల్ లో టాయిలెట్లను నిర్మిస్తాం. ప్రతి గ్రామంలో విద్య, వైద్యం నా తొలి ప్రాధాన్యత అన్నారు. అతి త్వరలో 9వ తరగతి చదివే విద్యార్ధులకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేయిస్తా. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేని పరికరాలను కూడా కరీంనగర్, వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసిన. ఇకపై బీజేపీ సర్పంచ్ లు గెలిచిన గ్రామాల్లో సైతం అందిస్తాన‌న్నారు.

గత ప్రభుత్వం గ్రామాలను నాశనం చేసింది…

గత కేసీఆర్ (KCR) ప్రభుత్వం కేంద్ర నిధులను డైవర్ట్ చేసి పంచాయతీలను సర్వనాశనం చేసింది. ఈసారి ఆ పరిస్థితి రాకూడదంటే కేంద్ర నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు నిధులిచ్చేదాకా పోరాడతాం. ఈ విషయంలో బీజేపీతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులు కూడా కలిసి రావాలని కోరుతున్నాన‌న్నారు. సర్కార్ మెడలు వంచి నిధులు తీసుకొచ్చే బాధ్యతను రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ తీసుకుంటుంది. బీజేపీ సర్పంచులన్న గ్రామాలతోపాటు మిగిలిన గ్రామాల అభివృద్ధి విషయంలోనూ సహకరిస్తాన‌న్నారు.

ఆయా గ్రామాల్లో గెలిచిన సర్పంచులు సైతం ఇగోలను పక్కనపెట్టి అభివృద్ది విషయంలో కలిసి రావాలి. బీజేపీ పక్షాన గెలిచిన సర్పంచులు సైతం తమ గ్రామాల్లో ప్రత్యర్ధి పార్టీలు బలపర్చిన అభ్యర్థులను కలుపుకుపోవాలన్నారు. అందరూ కలిసి గ్రామాలను అభివ్రుద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. గెలిచిన వాళ్లే కాదు.. పార్టీ కోసం పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కూడా అభినందనలు చెబుతున్నాన‌న్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులంతా గెలిపించుకునేందుకు పార్లమెంట్ కు వెళ్లకుండా అమిత్ షా నుండి అనుమతి తీసుకుని కరీంనగర్ (Karimnagar) లో మకాం వేసి ఏం చేశానో మీకు తెలుసు. కొంత మంది కార్యకర్తలు పోటీ చేయాలంటే నామినేషన్ వేయడానికి కూడా పైసల్లేని పరిస్థితి. అయినా 500 పంచాయతీల్లో పోటీ చేసి బీజేపీ ఉనికి చాటారు. ఓడినపప్పటికీ వాళ్ల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో అభివృద్ధి నిధులు వెచ్చిస్తానని మాట ఇస్తున్నాన‌ని బండి సంజ‌య్ అన్నారు.

Leave a Reply