EX MLA | కొండా సురేఖ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నాం

EX MLA | కొండా సురేఖ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నాం

  • పూలే విగ్రహాల ఏర్పాటులో…
  • ఉరుసులో పూలే విగ్రహం ఏర్పాటు చేసి తీరుతాం
  • మాజీ ఎమ్మెల్యే నరేందర్

EX MLA | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటులో మంత్రి కొండా సురేఖ రాజకీయ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ… కొద్ది నెలల క్రితం స్థానిక కరీమాబాద్, ఉర్సు దర్గా ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. బీసీల ఆరాధ్యదైవం అయిన మహాత్మాపూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలతో కలసి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.

ఉర్సు గుట్టలో దుండగుల చేతిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసమైన‌ వెంటనే స్పందించి, సొంత ఖర్చుతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల పునఃప్రతిష్టకు శంకుస్థాపన చేశారు. తద్వారా విగ్రహాన్ని ధ్వంసం చేసిన కుటిల రాజకీయ శక్తులకు కేవలం రాజకీయ సమాధానం మాత్రమే.. సామాజిక న్యాయం దిశగా గట్టి హెచ్చరిక పంపారు. కానీ బీసీలలో ఎక్కడ తనకు మంచి పేరు వస్తుందనో కారణంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిర్మాణ అనుమతుల పేరుతో జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ట పనులను మంత్రి కొండా సురేఖ అడ్డుకున్న విషయం ప్రజలందరికీ తెలుసని నన్నపునేని నరేందర్ ధ్వజమెత్తారు. ఆ రోజున అధికార బలంతో పనులను ఆపించిన మంత్రి కొండా సురేఖ, నేడు 35వ డివిజన్‌లో విగ్రహ ప్రతిష్టకు సహకారం అందిస్తామని ప్రకటించడం వెనుక ప్రజలను, ముఖ్యంగా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, ఇది ఆమె రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నన్నపునేని మండిపడ్డారు.

ఆనాడు పూలే ఆశయాలకు అడ్డు నిలిచిన మంత్రి కొండా సురేఖ దుర్మార్గ చరిత్రను ఈ రోజు మాటలతో కప్పిపుచ్చే ప్రయత్నాన్ని వరంగల్ ప్రజలు అంగీకరించరని నన్నపునేని స్పష్టం చేశారు. విగ్రహల వద్ద ఫోటోలు దిగడం పూలేకు గౌరవం కాదని, ఆయన ఆశయాల కోసం అడ్డంకులు లేకుండా నిలబడి పోరాడడమే నిజమైన నివాళి అని, పూలే ఆశయాలు రాజకీయ అవసరాలకు కాదు.. బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినవని..ఆ సత్యాన్ని ఎవరూ మార్చలేరన్నారు. పూలే విగ్రహాల ఏర్పాటు విషయంలో మంత్రి కొండా సురేఖ నియోజకవర్గంలోని రెండు వేరువేరు చోట్ల ద్వంద్వ‌ వైఖరిని వరంగల్ ప్రజలు గమించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఉర్సు దర్గా ప్రాంతంలో ధ్వంసమైన పూలే విగ్రహం స్థానంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి తీరుతామని నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు.

Leave a Reply