ఆలేరు సెగ్మెంట్‌లో హస్తానిదే హవా..

  • చక్రం తిప్పిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
  • 80 శాతం సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్‌కే
  • సంబరాల్లో మునిగితేలిన కాంగ్రెస్ క్యాడర్
  • ఆలేరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఐలయ్య

ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : మూడు విడతలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను కైవసం చేసుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలిచిందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ… మొదటి, మూడో విడతల్లో ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను సమర్థవంతంగా నిలువరించి, అత్యల్ప స్థానాలకే పరిమితం చేయగలిగామని తెలిపారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. సాధారణ ఎన్నికల సమయంలో ఏర్పడిన బలమైన ప్రజా మద్దతు, రెండేళ్ల తరువాత జరిగిన ఈ స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిందని, కాంగ్రెస్ సాధించిన ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో ఏకంగా 80 శాతం స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొందని అన్నారు. కొద్ది రోజుల్లో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ విజయం కాంగ్రెస్ శ్రేణులకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఆలేరు సెగ్మెంట్‌లో మొత్తం 140 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినట్లు తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఆలేరు ప్రజలు కాంగ్రెస్‌కే అండగా ఉన్నారని ఈ స్థానిక ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని చెప్పారు. భారీ మెజారిటీలతో సర్పంచులను గెలిపించిన ఆలేరు ప్రజలకు బీర్ల ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.