GHMC general meeting | కౌన్సిల్.. సాఫీగా సాగేనా!

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి సమావేశమే చివరిదో, మరో సమావేశం ఉంటుందో అనే అనుమానాల మధ్య జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం నేడు జరుగనుంది. ఉదయం 10.30 మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రధాన కార్యాలయంలో జరుగనుంది. ప్రారంభమైన వెంటనే ఇటీవలే మరణించిన ప్రముఖ కవి అందెశ్రీకి నివాళులు అర్పించనున్నారు. ఇక కౌన్సిల్ ప్రారంభమైన వెంటనే టీ బ్రేక్ ఇచ్చి సభ్యులందరితో జీహెచ్‌ఎంసీ చరిత్రలో తొలిసారిగా గ్రూప్ ఫొటో షూట్ నిర్వహించనున్నారు.
ఇక ప్రతిసారీ ప్రతి కౌన్సిల్ లో అప్పటి గ్రూప్ ఫొటోను కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో సమావేశం ప్రారంభం కానుండగా.. ఇందుకోసం ఆయా సభ్యులు 95 ప్రశ్నలను అందజేశారు. అయితే, ఇందులో ఎన్ని ప్రశ్నలను మేయర్ తీసుకుంటారో అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు 46 అంశాలతో కూడిన అజెండాపై సమావేశంలో చర్చించనున్నా రు. ఇక ప్రతిపక్ష బీజేపీ వందేమాతరం 150 సం.లు పూర్తి చేసుకుంటోన్న సందర్భంగా కౌన్సిల్‌ను వందేమాతరంతో ప్రారంభించాలని డిమాండ్ చేయనున్నారు.
ఇక బీఆర్‌ఎస్ ఐదేళ్లలో మూడేళ్ల తమ హయాంలో, రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత సమస్యలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంటే… అధికార కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక సమావేశానికి ముందు బీజేపీ సంకెళ్ల చుట్టుకుని నిరసనగా సమావేశానికి రానున్నారు.
సాఫీగా సాగేనా… ఇక ఈ కౌన్సిల్ సమావేశం రోజునే పాలక మండలి, సభ్యుల ఫొటో షూట్ కార్యక్రమాన్ని నిర్వహించి, జనవరిలో బడ్జెట్‌పై జరిగే చివరి కౌన్సిల్ సమావేశంలో సభ్యు లకు ఫొటోలను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. జనవరిలో నిర్వహించనున్న చివరి కౌన్సిల్ సమావేశాన్ని కేవ లం బడ్జెట్ ఆమోదం కోసం కొద్దిసేపు మాత్రమే నిర్వహించనున్నారు.
2020 డిసెంబర్ ఎన్నికల్లో గెలిచి, 2021 ఫిబ్రవ రిలో కొలువుదీరిన ఈ పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో గడిచి న అయిదేళ్లలో నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై, పరిపాలన పరంగా తీసుకువచ్చిన సరికొత్త సంస్కరణలపై అధికార పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల వారిగా సభ్యులకు మాట్లాడే అవకాశమివ్వనున్నట్లు అధికారపార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో ప్రశ్నించేందుకు కార్పొరేటర్‌లు పలువురు 95 ప్రశ్నలను అందించారు. ఇక ప్రధానంగా హెచ్‌సి టీ పనులు, ఎస్‌ఆర్ డీపీ పనులు, దశాబ్దాలుగా వివాదం గా ముడిపడి ఉన్న ప్రధాన కార్యాలయంలో పరిష్కారమైన విగ్రహాల పంచాయతీతో పాటు స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలు, ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈసారి బతుకమ్మకు గిన్నీస్ రికార్డు ఆఫ్ వరల్డ్‌లో స్థానం దక్కటం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.
భారీ పోలీస్ బందోబస్తు మధ్య సమావేశం.. ఇక ఇదే చివరి సమావేశమా.. మరో సమావేశం ఉంటుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి కావడంతో ఈసారి సభ్యులు ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించే అవకా శం ఉందన్న సమాచారంతో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలపై గళం విప్పేందుకు మజ్లీస్ పార్టీ సిద్ధమవుతుండగా, అధికార పార్టీని ఇరకాటం పెట్టేందుకు కమలనాథులు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హెచ్‌ఎండీఏ, అడిషనల్ కలెక్టర్లను కూడా ఆహ్వానించాలన్న అంశంపై ఇటీ-వలే ప్రధాన కార్యాలయంలో నిరసన చేపట్టిన బీజేపీ ఈ నెల 25వ తేదీన కౌన్సిల్‌లో ఇదే విషయంపై గట్టిగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతు న్నట్లు- సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీ కూడా ప్రజా సమస్యలపై నిలదీసేందుకు ఇప్పటికే ప్రశ్నలను సమర్పించినట్లు- తెలిసింది. ఇక బీజేపీ సభ్యులు వినూత్న శైలిలో నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు.
