Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

  • నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
  • మధ్యప్రదేశ్ నుంచి తీర్థయాత్రలకు వెళ్తూ ప్రమాదం
  • ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన తూఫాన్ వ్యాన్
  • కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా ఎత్తురాళ్లపాడు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పై ఆదివారం వేకువజామున సుమారు రెండున్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం మార్గాడి, బొప్పడ, కజారి తదితర గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరంతా తీర్థయాత్రలకు వెళ్తూ మృత్యు ఒడికి చేరుకున్నారు. కోటబొమ్మాలి ఎస్సై వి. సత్యనారాయణ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ కు చెందిన మూడు గ్రామాల నుంచి పది మంది బంధువులు డ్రైవర్ తో కలిసి తూపాన్ వాహనంలో ఈ నెల 10న తీర్థయాత్రలకు బయలుదేరారు. ఉత్తర ప్రదేశ్, నేపాల్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా పూరీ, తదితర చోట్ల దైవదర్శనాలు చేసుకుని శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళుతుండగా వీరు పయనించే వాహనం ప్రమాదానికి గురైంది. కోటబొమ్మాలి మండలంలోని ఎత్తురాళ్లపాడు సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని వీరు పయనిస్తున్న వాహనం ఆదివారం వేకువజాము సుమారు రెండున్నర గంటల సమయంలో బలంగా ఢీ కొట్టింది.

దీంతో విజయ్ సింగ్ తోమర్ (65), బూరె సింగ్ పవర్ (60), ఖుశియల్ సింగ్ (65), తో పాటు సంతోష్ బాయ్ (60) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్ తో పాటు మరో ఐదుగురు సీరాబాయి పటేల్, సావిత్రిబాయి, సుమన్ భాయ్, సంతోషి బాయ్, శకుంతల తోమర్ గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాలి ఎస్సై వి. సత్యనారాయణ, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాలి వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, డి.ఎస్.పి లక్ష్మణరావు, సిఐ శ్రీనివాసరావు, సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనను పరిశీలించారు. సి ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply