Prajavani | నేటి నుంచి ప్రజావాణి షురూ..

Prajavani | నేటి నుంచి ప్రజావాణి షురూ..

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో తాత్కాలికంగా వాయిదా
  • ఆదివారంతో ముగిసిన ఎన్నికల కోడ్‌
  • పోటెత్తనున్న ఫిర్యాదులు
  • గత నెల 6న వచ్చిన ఫిర్యాదులు-206
  • ఇందులో గృహనిర్మాణ సమస్యలే అధికం

హైదరాబాద్‌, (ఆంధ్ర ప్రభ) : హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేటి నుంచి తిరిగి మళ్లి నిర్వహిస్తారు. నగరంలోనే జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు గతనెల అక్టోబర్‌ 6న ఎలక్షన్‌ షెడ్యూల్‌ జారీచేయటంతో పాటు అదేనెల 13న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది.

దీంతో గతనెల 13న జరగాల్సిన ప్రజవాణితో సహా అన్ని కార్యక్రమాలకు బ్రేక్‌పడింది. ఇక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ముగిసి, ఫలితం కూడా రావడంతో అధికారికంగా ఆదివారం సాయంత్రంతో కోడ్‌ ముగిసింది. ఇక హైదరాబాద్‌లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి జరుగనుంది. దీంతో నెల రోజులుగా వాయిదా పడింది.. కోడ్‌ ముగిసిన తర్వాత మళ్లి పునరావృతం కానుంది.

పోటెత్తనున్న ఫిర్యాదులు..

జిల్లా కలెక్టరేట్‌ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గతనెల 6న నిర్వహించిన ప్రజావాణికి దాదాపు 206 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్‌ జి.ముకుందరెడ్డి హాజరైన ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ ఫిర్యాదుల్లో అత్యధికంగా రెండు పడకల గదులు-08, ఇందిరమ్మ ఇళ్లు-90 అంటే గృహ సమస్యలకు చెందినవే 98 వరకు అత్యధికంగా వచ్చాయి.

అనంతరం పెన్షన్‌ -26, రెవెన్యూ- 46, ఇతర శాఖలకు సంబధించినవి 36 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గత నెల 6న చివరిసారిగా నిర్వహించిన ప్రజావాణికే 206ఫిర్యాదులందితే.. గత నెల రోజులకు పైగా ప్రజావాణి జరగలేదు. దీంతో ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యే ప్రజావాణికి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందే అవకాశం ఉంది.

Leave a Reply