Veligonda | పనులు పూర్తి చేయాలి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
వెలిగొండ రెండవసారి పర్యటనలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
ఆంధ్రప్రభ బ్యూరో, పశ్చిమ ప్రకాశం : ప్రకాశం జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయడానికి యుద్ధప్రాతిపదికన పనులు చెయ్యాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు (Dr. Nimmala Ramanaidu) హెచ్చరించారు. 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు సాగు,ప్రజలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకు పనుల పురోగతిని పరిశీలిచేందుకు వారం రోజుల వ్యవధిలో రెండవసారి వెలిగొండ ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి ఉన్నతధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.

ప్రాజెక్టు పనుల (Project work) ను పరిశీలించిన మంత్రి పనులు జరుగుతున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో పరిశీలించిన మంత్రి నిమ్మల, నాడు ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు, టన్నెల్స్ లో డీవాటరింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
యుద్ధప్రాతిపదికన టన్నెల్ డీవాటరింగ్ పనులు (Dewatering works) పూర్తి చేయమని ఆదేశించినా, పూర్తికాకపోవడంపై అధికారులు, ఏజెన్సీ పై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 సంవత్సరంకు ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే సరిపోదు, ఏజెన్సీలకు, అధికారులకు కూడా ఉండాలన్నారు.
2026 కల్లా వెలిగొండ (Veligonda) పూర్తి చెయ్యాలనే చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనులు చెయ్యడంపై నిర్లక్ష్యం వహిస్తే, తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీని మంత్రి హెచ్చరించారు. లక్ష్యం మేరకు వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా చంద్రబాబు ఆదేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. వెంటనే టన్నెల్స్ లో లైనింగ్, బెంచింగ్ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు, ఏజెన్సీకి మంత్రి ఆదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి, ప్రకాశం జిల్లా (Prakasam District) రైతుల సాగు, తాగునీటి కష్టాలు తీర్చుతాం. పూర్తి చేసేలా చంద్రబాబు ఆదేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తానన్నారు. వెంటనే టన్నెల్స్ లో లైనింగ్, బెంచింగ్ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు, ఏజెన్సీని ఆదేశించారు. 456 కోట్లతో చేపట్టే, ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఈనెలలోనే ప్రారంభించి వచ్చే సీజన్ కు పూర్తి చెయ్యాల్సిందేనన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి, ప్రకాశం జిల్లా రైతుల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చుతామన్నారు. సమావేశంలో మంత్రి వెంట శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ముత్తుమల అశోకరెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, జలవనరుల శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.

