- విలీనం కానున్న నాలుగు గ్రామీణ బ్యాంకులు
- ఇక రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సేవలు
- ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు
- ఖాతాదారుల అకౌంటు నెంబర్, సేవలు యథాతథం
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : ఒకే రాష్ట్రం, ఒకటే గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలో మే ఒకటవ తేది నుండి అమలులోకి రానుంది. బ్యాంకుల విలీనంతో రాష్ట్రంలోని నాలుగు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉన్నాయి.
వీటిని విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. మే 1 నుండి ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కనిపించవు.
అయితే బ్యాంకుల విలీనంతో ఖాతాదారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. వారి ఖాతా విలీన బ్యాంక్ నుంచి ప్రధాన బ్యాంకుకు మారుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో అకౌంట్ కొనసాగుతుంది.
ఈ విలీనానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం లబించడంతో విలీన ప్రక్రియ చకచకా జరిగిపోయింది. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ పేరు మాత్రమే మారుతుంది. మిగిలి సేవలన్నీ యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
