Boath | ప్రోటోకాల్ రగడ..!
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ బాహాబాహి..!
పిడిగుద్దులతో రణరంగం.. !
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ (Boath constituency) కేంద్రంలో ప్రోటోకాల్ వివాదం పిడిగుద్దులతో రణరంగంగా మారింది. బుధవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) పక్కనే స్టేజీపై బి ఆర్ ఎస్ నేతలు పాల్గొనగా కాంగ్రెస్ నేతలు అడ్డు తగిలారు. ప్రోటోకాల్ లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని నిలదీశారు.

దీంతో మాటమాట పెరిగి పరస్పరం ఇరు పార్టీల నేతలు వాగ్వివాదంతో చేయి చేసుకోవడం ఆందోళనకు దారితీసింది. నువ్వెంత, నీ స్థాయి ఎంత అంటూ ఒకరినొకరు వాదలాడుకున్నారు. కాంగ్రెస్ (Congress) అధికార ప్రతినిధి పసుల చంటి, ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితర నేతలు బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన తుల శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి లను నిలదీశారు. చెక్కుల పంపిణీ రసా బసాగా మారుతుండగానే కార్యకర్తలు పరస్పరం దూసుకుంటూ కుర్చీలు విసురుకుంటూ పిడుగుద్దులతో కొట్టుకున్నారు. చొక్కాలు చినిగిపోయేంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది.
వెంటనే ఇచ్చోడ, బోథ్ సిఐలు, ఎస్సైలు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత డిఎస్పీ జీవన్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) మాట్లాడుతూ… తమ కార్యకర్తలు ఎలాంటి గుండాయిజానికి పాల్పడలేదని, సమస్య సద్దుమణిగే లోపే కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేశంగా దూసుకు వచ్చి గొడవ సృష్టించారన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆడపడుచుల ముందర ఘర్షణకు దిగడం శోచనీయమన్నారు.

