భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..?

భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..?

సంగారెడ్డి,ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్ప‌ట్ల గ్రామ ప‌ర‌ధిలోని అపిటోరియా యూనిట్-1 పరిశ్రమలో ఉన్నఈటీపీ ప్లాంట్ లో శనివారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. భారీగా పొగలు క‌మ్ముకొని వ్యాపించడంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యూనిట్‌-1 ప్లాంట్ లో రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే యంత్ర సమీపంలో ఒక్కసారిగా మంటలు చెల‌రేగాయి. నిమిషాల వ్య‌వ‌ధిలోనే మంటలు తీవ్ర రూపం దాల్చాయి. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స‌మాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమించింది. అప్పటికే ఈటీపీ ప్లాంట్ పూర్తిగా కాలిబూడిద‌య్యింది.

భారీగా రసాయన పదార్థాలు ఉండ‌టంతో మంట‌ల్లో దగ్ధమయ్యాయి. దీంతో ప‌రిశ్ర‌మ చుట్టు ప‌క్క‌ల దుర్వాసన వ్యాపించింది. స‌మీప గ్రామాల ప్రజలు కొంద‌రు అస్వస్థతకు గురయ్యారు. ఇంత‌కు ముందు కూడా ఇదే ప్లాంట్ లో భద్రతా చర్యలు చేప‌ట్ట‌డం లేద‌ని అధికారులకు ఫిర్యాదు చేశామ‌ని ప‌ల‌వురు గ్రామ‌స్తులు పేర్కొన్నారు కానీ.. ఎటువంటి చర్యలు తీసుకోవ‌డం లేద‌ని, ప్ర‌స్తుత ప్ర‌మాదానికి కార‌ణం కంపెనీ యాజ‌మ‌న్యం నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమ ప్రాంగణంలో పోలీసులు, పీసీబీ అధికారులు ప‌రిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై నిర్ల‌క్ష్య ధోర‌ణి..
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయకపోవడం, రసాయన వ్యర్థాల నిల్వలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు నిత్యం ఏదో ఒక క‌ర్మాగారంలో జ‌రుగుతున్నాయని ప‌ల‌ఉవురు ఆరోపిస్తున్నారు. ప్రతిసారి ప్రమాదం జరుగ‌గానే అధికారులు ఉరుకులు, ప‌రుగులు పెడ‌తార‌ని, ఆ తర్వాత ప‌ట్టించుకునే నాథుడే ఉండ‌డ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌మాదాలు జ‌రుగ‌క ముందే తనిఖీలు జరిపి ఇలాంటి సంఘటనలు నివారించాల‌ని స్థానికులు సూచిస్తున్నారు. సిగాచి ఫార్మాలో ఘోర ప్ర‌మాద ఘ‌ట‌న మ‌రువ‌క‌మూందే మ‌రో పరిశ్రమలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డం అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌ని గ్రామ‌స్తుడొక‌రు పేర్కొన్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాల పై మరోసారి చ‌ర్చ‌కు దారితీసింది. అధికారులు ఇలాగే ఉదాసీన‌త‌తో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇలాంటి ప్రమాదాలు పునరావృతమ‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని స్థానికులు చెబుతున్నారు.

త‌ప్పిన భారీ ప్రాణ న‌ష్టం..
శ‌నివారం వీకెండ్ ఉంటడంతో షిప్ట్ చేంజింగ్ వ‌ల్ల ప్ర‌మాద స‌మ‌యంలో కంపెనీలో కార్మికులు ఎవరూ లేక పోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చారు. సిగాచి పరిశ్రమ ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే గత సంవత్సరం చందపూర్ లో ఓ పరిశ్రమ సృష్టించిన విధ్వంసం మరచి పోకముందే ఈ అపిటోరియా కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

Leave a Reply