బైక్ ను ఢీకొన్న సిమెంట్ లారీ..

- యువకుడు అక్కడికక్కడే మృతి
గంగవరం, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ను ఓ సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గంగవరం సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం…
పుంగనూరు నుండి పలమనేరు వైపు వెళ్తున్న సిమెంట్ లారీ, అప్పినపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆగి ఉన్న బస్సును తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీలపట్ల పంచాయతీ నలసానిపల్లె గ్రామానికి చెందిన భరత్ (25) అక్కడికక్కడే మృతి చెందగా, అతని స్నేహితుడు కార్తీక్ (24) తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్తీక్ను స్థానికులు వెంటనే పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు తరలించారు.
భరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భరత్ మేలుమాయి వెటర్నరీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. భరత్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు ఏరియా ఆసుపత్రిలో శోకసంద్రంలో మునిగిపోయారు.
