పెద్దన్న ఏం ఆలోచిస్తాడో.. ఏం చేస్తాడో..!!

‘ట్రంపు తీరు ప్రపంచానికి బేజారు’ అన్నట్టు తయారైంది ప్రస్తుతం… ఎప్పుడేం మాట్లాడతారో..ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎవరిపై ఏ కొరడా ఝుళిపిస్తారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రపంచదేశాల పాలకులు, ప్రజలు. అందర్నీ కంగారెత్తించి ఆయనేం సాధించాలనుకుంటున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.
‘అమెరికా ఫస్ట్’ అంటున్నారు సరే, మరి ఆ నినాదం అమెరికన్లకు ఎంతవరకు ఆమోదయోగ్యమో ట్రంపు కానీ, ప్రజలు కానీ చెప్పగలరా అంటే ప్రశ్నార్థకమే. దానికి ఉదాహరణ ఇటీవల అమెరికాలో ట్రంప్ పై పెరుగుతున్న వ్యతిరేకత, “నో కింగ్స్” ఉద్యమాలు.
ఇక డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానం అత్యంత గందరగోళంగా తయారైందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తుల పట్ల వారి స్నేహాలు, శత్రుత్వాలు వ్యక్తిగతం కావచ్చు. కానీ పాలకులు ఎవరితోనైనా కయ్యం, నెయ్యం నెరిపారంటే మాత్రం ఆ ప్రభావం పాలనపై తప్పకుండా పడుతుంది. తన గెలుపులో ప్రధానపాత్ర పోషించిన ఎలాన్ మస్క్ తో కొంతకాలం స్నేహమనీ, మరికొంతకాలం కయ్యమనీ సయ్యాటలాడారు ట్రంప్. అలాగే చైనా, భారత్ లతో రోజుకో తీరుతో అందర్నీ అయోమయానికి గురిచేస్తున్నారు. అప్పుడే మోడీ నా ఫ్రెండంటాడు…మరుక్షణంలోనే భారత్ పై సుంకాలంటాడు….చైనాపై వందశాతం సుంకాలంటాడు, మళ్ళీ నవ్వుతూ కరచాలనాలు చేస్తూంటాడు…ఇది ఆయా దేశాల ఆర్థిక, వాణిజ్య విధానాలపై కూడా అయోమయ, అనిశ్చితి వాతావరణానికి దారితీస్తుందని తెలియనంత అమాయకుడేం కాదు ట్రంప్.
నోబెల్ ప్రైజ్ కోసం…
నోబెల్ ప్రైజ్ అందుకోవడం అనేది ట్రంపు తీరని కోరిక…ప్రపంచ శాంతి నెలకొల్పుతున్నాననీ, దేశాలమధ్య యుద్ధాలు ఆపాననీ, ఎన్ని వేదికలమీద ఎలుగెత్తి అరిచినా నేబెల్ ప్రైజు రానేలేదు. అయినా వచ్చేసారికైనా రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు ట్రంపు గారు. అది కాస్తా హాస్యాస్పదంగా మారింది. అయినా ఆయన తీరే మారడం లేదు…
ఈమధ్య ట్రంపు మరో రెండు బాంబులు పేల్చారు. అణూపరీక్షలు చేస్తున్నామని. ఒకపక్క శాంతి కోసం పరితపిస్తున్నానంటూనే ఇదేం పని మహానుభావా అని ప్రపంచం నివ్వెరబోతోంది. మరొకటి, ఇంకో టర్మ్ తనకు అధికారం ఇవ్వాలని అమెరికన్లు అనుకుంటున్నారని..అందుకు అవకాశాలుంటే తప్పకుండా అది నెరవేరుతుందనీ ఆశాభావం వ్యక్తం చేసారు…కానీ అది నెరవేరదని తేలిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అమెరికన్లు. ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉండే రోజులెన్ని అని లెక్కబెట్టుకుంటూ కాలం గడుపుతున్నారట పాపం అమెరికన్లు…
