రైతులను ఆదుకునేలా చర్యలు

రైతులను ఆదుకునేలా చర్యలు
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి సమర్పించి, పంటను నష్టపోయిన రైతులను ఆదుకునేలా చర్యలు ఉంటాయని.. తనవంతుగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి(Chadalawada Nagarani) అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయ పాలెం, పెంటపాడు మండలంలోని రావిపాడు, గణపవరం మండలంలోని చిలకంపాడు గ్రామాలలో నేలకొరిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్(Bolisetty Srinivas) క్షేత్రస్థాయిలో ఈ రోజు పరిశీలించారు.
ఈ సందర్భంలో రైతులు తమ ఆవేదన తెలియజేసుకున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్ట పోయామని, ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉందని, పంట తయారైన తర్వాత యంత్రం ద్వారా కొయ్యడం సాధ్యం కాదని, మనుషుల ద్వారా కోయిస్తే చాలా ఖర్చు అవుతుందని వాపోయారు. సుమారు 40 శాతం దిగుబడిని కోల్పోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందిస్తూ.. రైతులకు ధైర్యం చెప్పారు. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం(Government) దీని పై ఆలోచన చేసి సముచిత పరిష్కారం చేస్తుందన్నారు. రైతులు చాలా కష్టపడి పండించిన వరి నేల కొరగడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని, కొంత పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులు అన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగిందన్నారు.
ప్రభుత్వం పంట నష్టం వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించడం జరిగిందని, ఈరోజు కూడా అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ(Principal Secretary to Agriculture) జిల్లా కలెక్టర్ లతో రివ్యూ చేయడం జరిగిందన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సి ఉందో ఐదు రోజుల్లోగా పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతి వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇదే పనిలో నిమగ్నమై ఎన్యువరేషన్ చేస్తున్నారనీ, ఖచ్చితంగా మీ అందరికీ అవసరమైన మేర సహాయాన్ని అందించడానికి మన ముఖ్యమంత్రి, ప్రభుత్వం ముందుంటుందని తెలియజేశారు.
తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తాం
తుఫాన్ వల్ల తడిచిన ప్రతి ధాన్యం గింజలను కొనుగోలు చేస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడటం జరిగిందని తెలిపారు. కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేయమని వారు చెప్పారన్నారు.
రైతులెవరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రత్యేక స్థానం ఉందని, వారికి ఇబ్బంది కలిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి(Chief Minister, Deputy Chief Minister) తప్పకుండా తగు న్యాయం చేస్తారని రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి(T. Rahul Kumar Reddy), తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, సివిల్ సప్లైస్ ఎండి ఎండి ఇబ్రహీం, తహసిల్దార్లు ఏం.సునీల్ కుమార్, రాజ రాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ చైర్ పర్సన్ ములగల శివ కేశవ, స్థానిక నాయకులు వలవల బాబ్జి, ఆకాశపు స్వామి, డాక్టర్ పద్మనాభుని మురళీమోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
