ప్రకటించిన పల్నాడు జిల్లా అధికారులు

ప్రకటించిన పల్నాడు జిల్లా అధికారులు

నిలిచిన ఆర్టీసీ.. ఇంతకీ ఎక్కడ..?

పల్నాడు ప్రతినిధి (ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లాను “మొంథా తుఫాన్” వణికిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పల్నాడు జిల్లాకు “రెడ్ అలర్ట్” ప్రకటించారు. దీంతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల స్థానిక అధికారులను అలెర్ట్ చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టుమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని పలుమార్గాలలో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జిల్లాలో కేవలం 30% ఆర్టీసీ సర్వీసులను బుధవారం ఒంటి గంట వరకు నడపగలిగామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అనిత కుమారి తెలిపారు. పలు మండలాలలో ఉధృతంగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ప్రత్యేక శిబిరాల్లోకి తరలించి, వారికి భోజన, వసతి సౌకర్యాలను స్థానిక అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిబిరాల్లో ముంపు ప్రాంతవాసులు తల దాచుకుంటున్నారు. వరద ప్రాంతాల్లో కలెక్టర్, జెసి, ఇతర శాఖల అధికారులు పర్యటిస్తూ ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా వెల్దుర్తి మండలం, సిరిగిరిపాడు రెవెన్యూ పరిధిలోని వజ్రాలపాడు పంచాయతీ గల కుంకుడు చెట్టు పెంట తండా నందు గల 40 కుటుంబాలు, 70 మందిని జిల్లా పరిషత్ హై స్కూల్ సిరిగిరిపాడు నందు తరలించి, వారికి కావాల్సిన టిఫిను భోజనం ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి పట్టణంలో హారిస్ స్కూల్ నందు గల రీ హ్యాబిటేషన్ సెంటర్లో ఉన్నటువంటి వారికి ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసి, అనారోగ్య పరిస్థితులు దృష్ట్యా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట మండలం కావూరు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వరదనీరును జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. అనంతరం చిలకలూరిపేట సుగాలి కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని పరిశీలించి, ఫుడ్ ప్యాకేట్స్ అందజేసి, విద్యార్థులకు టిఫిన్ వసతులను జిల్లా కలెక్టర్ స్వయంగా సమీక్షించారు.

వినుకొండ నిర్మల బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ పరిశీలించారు. అనంతరం నూజెండ్ల మండలం అయినవోలు గ్రామం వద్ద “గుండ్లకమ్మ వాగు” ప్రవాహాన్ని పరిశీలించారు. చిలకలూరిపేటలో అడ్డరోడ్డు వద్ద పొంగి పొర్లుతున్న వర్షపు నీరును శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి జిల్లా కలెక్టర్ శుక్ల పరిశీలించారు. అనంతరం యడ్లపాడు మండలం, తిమ్మాపురం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి బైపాస్ అండర్పాస్ వంతెన వద్ద భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కలెక్టర్ అక్కడికి చేరుకొని హైవే అధికారులను సత్వరమే నీటి నిలువ లేకుండా డ్రైనేజ్ ద్వారా తొలగించాలని ఆదేశించారు. కాగా అమరావతి మండలం అత్తలూరు, క్రోసూరు మండలం బయ్యవరం గ్రామాల మధ్యలో ఎద్దువాగు ఉధృతంగా ప్రవహించుట వలన రాకపోకలు నిలిచి పోయాయి. మొత్తం మీద పల్నాడు జిల్లా ఈ తుఫాను వల్ల అతలాకుతలమైందని చెప్పకనే తెలుస్తుంది.

Leave a Reply