నిర్దేశించిన గడువులోపు అనుమతులు
నిర్దేశించిన గడువులోపు అనుమతులు
- కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువు లోపు అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి (Collector Dr. A.Siri) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్ ఫర్డ్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం మరిన్ని పరిశ్రమలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా తలసరి ఆదాయం, జీడీపీ పెరుగుతుందన్నారు. అదే విధంగా ఉన్న పరిశ్రమలకు శాఖా పరంగా అవసరమైన సహకారం అందించాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని తెలిపారు. అందువల్ల సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులకు గడువు లోపు అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) కు సంబంధించి 19, కర్మాగారాల విభాగానికి సంబంధించి 1, భూగర్భ జల శాఖ కు సంబంధించి 1, ఏపీఎస్పీడీసీఎల్ కి సంబంధించి 1, లీగల్ మెట్రాలజీకి సంబంధించి 57 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వీటికి వేగవంతంగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ (Kalluru Industrial Estate) కు నీటిని సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు షాపులలో బరువు యంత్రాలను తనిఖీ చేస్తున్నారా, లేదా అని కలెక్టర్ లీగల్ మెట్రాలజీ అధికారిని ఆరా తీశారు. 15 రోజులో అన్నీ తనిఖీ చేయాలని ఆదేశించారు..
రూ 35. 92 లక్షల పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం..
పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 5 క్లెయిమ్‌లకు రూ.35 లక్షల 92 వేలకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ (Collector) పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ కింద ఐదు క్లెయిమ్స్‌కు సంబంధించిన ఐదుగురు ఎస్సీ లకు రూ. 35,92,201 పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆమోదం తెలపడం జరిగిందన్నారు.
సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం అశోక్ కుమార్, పరిశ్రమల శాఖ డీడీ జవహర్ బాబు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, నాబార్డ్ డీడీఏం సుబ్బారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ కుమార్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, ఐలా సెక్రెటరీ జగన్ మోహన్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
