Women’s Hockey Asia Cup | ఫైన‌ల్లో…

అద్భుతమైన లీగ్ ప్రదర్శనతో ఆసియా క‌ప్ ఫైనల్‌కు చేరుకున్న భారత మహిళా హాకీ జట్టు… ఆఖ‌రిపోరులో ఓటమిని చవిచూసింది. ఆసియా కప్ ఫైనల్‌లో చైనాతో త‌ల‌ప‌డిన భార‌త్.. 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ కప్ 2026కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కూడా కోల్పోయింది.

గోంగ్షు కెనాల్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో, మొదట్లో నవ్నీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్‌కు ఆధిక్యాన్ని అందించారు. ఆ తరువాత, చైనా క్రీడాకారిణి ఔ జిక్సియా పెనాల్టీ కార్నర్‌తో స్కోరును సమం చేసారు. మొదటి అర్థభాగం ముగిసేసరికి ఇరు జట్ల స్కోర్ 1-1తో సమానంగా ఉంది.

అయితే రెండో అర్థభాగంలో చైనా దూకుడు పెంచింది. లీ హోంగ్ దూరం నుంచి ఒక అద్భుతమైన షాట్‌తో చైనాకు ఆధిక్యాన్ని అందించగా, తర్వాత జౌ మేరోంగ్, జోంగ్ జియాకీ చివరి క్వార్టర్‌లో మరో రెండు గోల్స్ చేసి చైనా విజయాన్ని సులభతరం చేశారు.

ఈ విజయంతో చైనా మూడవసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకోగా… వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది.

Leave a Reply