హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలుగురాష్ట్రాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన మార్గాల్లో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 54 ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి.

ఈ పొడిగింపులో భాగంగా కాచిగూడ–మధురై, తిరుపతి, నాగర్పోల్, హైదరాబాద్–కొల్లాం, హైదరాబాద్–కన్యాకుమారి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వీటిలో సికింద్రాబాద్–తిరుపతి మధ్య 10 రైళ్లు, కాచిగూడ–నాగర్పోల్ రూట్‌లో 8 రైళ్లు, నాందేడ్–తిరుపతి మధ్య 10 రైళ్లు, నాందేడ్–ధర్మవరం మధ్య 10 రైళ్లు ఉన్నాయి.

హైదరాబాద్–కొల్లాం ప్రత్యేక రైలు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. అలాగే, హైదరాబాద్–కన్యాకుమారి ప్రత్యేక రైలు అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.

ఈ రైళ్లు ర‌ద్దు !

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న అతిభారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరిగింది. ఈ నేప‌థ్యంలో రైల్వే అధికారులు ప‌లు రైళ్ల వేగం తగ్గించాలని సూచనలు జారీ చేసి, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆగస్టు 14 నుంచి 18 వరకు 10 రైళ్లు రద్దు చేశారు.

రద్దయిన రైళ్లలో డోర్నకల్–విజయవాడ, విజయవాడ–డోర్నకల్, కాజీపేట్–డోర్నకల్, డోర్నకల్–కాజీపేట్, విజయవాడ–సికింద్రాబాద్, సికింద్రాబాద్–విజయవాడ, విజయవాడ–భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్–విజయవాడ, గుంటూరు–సికింద్రాబాద్, సికింద్రాబాద్–గుంటూరు సర్వీసులు ఉన్నాయి.

అలాగే, మరో 26 రైళ్లకు ఒక్క రోజు లేదా రెండు రోజుల పాటు సర్వీసులు నిలిపివేయబడతాయి. మూడు రైళ్లు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. ప్రయాణికులు రైళ్ల తాజా షెడ్యూల్ కోసం 139 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Leave a Reply