Kurnool | చికిత్స పొందుతూ మ‌హిళ మృతి.. ఆస్ప‌త్రిని ధ్వంసం చేసిన బంధువులు

కర్నూలు బ్యూరో : కర్నూలు (Kurnool) నగరంలోని శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కల్లూరు (Kalluru) కు చెందిన వనిత జ్వరం వచ్చిందని శ్రీచక్ర హాస్పిటల్ లో చేరారు. అయితే శ్రీ చక్ర హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందని హాస్పిటల్ ముందు వనిత (Vanita) తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం, అక్కడి వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలి కుటుంబం, బంధువులు హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు.

దీంతో శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులను మోహరించారు. మృతరాలి కుటుంబ, బంధువులకు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఫలితం లేకపోయింది. తమ కూతురు ప్రాణాలు తీసిన శ్రీ చక్ర హాస్పిటల్ పై చర్యలు తీసుకొని మరొకరి ప్రాణలు పోకుండా చూడాలంటూ మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.

డబ్బు కోసం జలగలా పీడించడం తప్ప.. తమ కూతురి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఏమాత్రం ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దాదాపు 4గంటల సేపు హాస్పిటల్ ముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. ఎంత చెప్పినా వినకపోవడంతో మృతురాలు బంధువులను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో హాస్పిటల్ యాజమాన్యంపై కర్నూల్ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply