ప్రశంసల్లోనూ.. పక్షపాతమేనా? నారాయణపేటలో ఉద్యోగుల అసంతృప్తి

ప్రశంసా పత్రాల ఎంపికపై ఉద్యోగుల్లో అసంతృప్తి
మూడు వేడుకలు.. పేర్లు మాత్రం అవేనా?
లక్ష్యాలు సాధించినా గుర్తింపు ఏది?
ప్రతిసారీ వారికే గుర్తింపా? ఉద్యోగుల ప్రశ్నలు
ప్రశంసా పత్రాల ఎంపికలో పారదర్శకత అవసరం

నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాల ఎంపికపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో ప్రతిసారీ ఒకే వ్యక్తులకు గుర్తింపు దక్కుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనితీరు, సేవలు, లక్ష్యాల సాధన ఆధారంగా కాకుండా అనుకూలతలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నిజాయితీగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో నిరుత్సాహం నెలకొంటోంది.

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ ఉద్యోగుల్లో పనితీరును ప్రోత్సహించి, విధుల పట్ల మరింత అంకితభావంతో పనిచేసేలా చేయాల్సిన ప్రశంసా పత్రాల జారీ ప్రక్రియ నారాయణపేట జిల్లాలో వివాదాస్పదంగా మారుతోంది.

స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వంటి ముఖ్యమైన సందర్భాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రశంసా పత్రాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిసారీ దాదాపు ఒకే వ్యక్తులకు వాటిని కట్టబెట్టడం పట్ల పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రశంసా పత్రం అంటే విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగిని గుర్తించి, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా అందించాల్సిన గౌరవం. అయితే జిల్లాలో కొన్ని శాఖల్లో ఉద్యోగి పనితీరు, సాధించిన లక్ష్యాలు, ప్రజలకు అందించిన సేవలు, ప్రత్యేకంగా చేసిన కృషి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించకుండా.. ఆయా అధికారులకు అనుకూలంగా ఉండే వారికే ప్రశంసా పత్రాలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో నిజాయితీగా, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంటోంది.


మూడు వేడుకలు.. పేర్లు మాత్రం అవేనా..!

ప్రతి ఏడాది మూడు ముఖ్యమైన ప్రభుత్వ వేడుకలు వచ్చినప్పుడల్లా ప్రశంసా పత్రాల కోసం ఉద్యోగుల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నప్పటికీ, ఎంపిక ప్రక్రియలో మార్పు కనిపించకపోవడం, ప్రతిసారీ అదే వ్యక్తులు లేదా అధికారులకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే జాబితాలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

ఒక ఉద్యోగి ఒక సందర్భంలో విశేష సేవ అందించి ప్రశంసా పత్రం పొందితే అది సమర్థించదగినదే. కానీ తదుపరి సందర్భాల్లో కూడా కొత్తగా ఎలాంటి ప్రత్యేక సాధన లేకుండానే అదే వ్యక్తికి వరుసగా గుర్తింపు లభిస్తుండటం వల్ల అసలు ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి? అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి.


లక్ష్యాలు సాధించినా గుర్తింపు ఏది?

ప్రభుత్వ శాఖల్లో రోజువారీ విధులతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన వివిధ లక్ష్యాలను సాధించేందుకు పలువురు ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, క్షేత్రస్థాయి సేవలు, రికార్డుల నిర్వహణ, లక్ష్యాల సాధన తదితర అంశాల్లో ముందుండి పనిచేస్తున్నప్పటికీ, వారిని గుర్తించి ప్రోత్సహించేవారు కరవవుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.

లక్ష్యాలను సాధించి, అదనపు పని భారం మోస్తూ, సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహించినా గుర్తింపు లేకపోతే.. ఇక ఎంత కష్టపడి పనిచేసినా ప్రయోజనం ఏమిటి? అంటూ పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.


మరి మేం విధులు నిర్వహించడం లేదా?

ప్రతిసారీ ఒకే వర్గానికి చెందిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తే మిగిలిన ఉద్యోగుల్లో సహజంగానే నిరుత్సాహం ఏర్పడుతుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు.

ప్రతిసారీ వారినే ప్రోత్సహిస్తుంటే.. మేం విధులు నిర్వహించడం లేదా? మా పనితీరును ఎవరు గుర్తిస్తారు? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించాల్సిన అధికారులు, తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ఉద్యోగుల్లో కలగడం పరిపాలనా వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో..!

ప్రశంసా పత్రాల ఎంపికలో అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహారం సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారులు మెచ్చిన వారికే గుర్తింపు దక్కుతుందనే అభిప్రాయం బలపడితే, నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రశంసా పత్రం పొందిన ఉద్యోగి తప్పనిసరిగా తప్పు చేశాడని చెప్పడం కాదు. అయితే ఒకే వ్యక్తులకు వరుసగా గుర్తింపు ఎందుకు వస్తోంది? ఇతర శాఖల్లో లక్ష్యాలను అధిగమించిన ఉద్యోగులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? ఎంపికకు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు? అనే ప్రశ్నలకు అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.


పారదర్శక విధానం అవసరం

ప్రశంసా పత్రాల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ప్రతి శాఖ నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు విధి నిర్వహణ, లక్ష్యాల సాధన, ప్రజలకు అందించిన సేవలు, ప్రత్యేక కృషి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

అంతేకాకుండా ఒక ఉద్యోగికి గతంలో ప్రశంసా పత్రం ఇచ్చినట్లయితే, అదే ఉద్యోగిని మరోసారి ఎంపిక చేసే సమయంలో ఈసారి వారు చేసిన అదనపు లేదా ప్రత్యేక సేవ ఏమిటో స్పష్టంగా నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.


జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలి

ప్రశంసా పత్రాలు ఉద్యోగుల మధ్య విభేదాలకు కారణం కాకుండా, విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహంగా నిలిచేలా ఉండాలి.

ఇందుకోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి, శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పనితీరు ఆధారంగా పరిశీలించి తుది జాబితా రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ప్రశంసా పత్రం అధికారులకు నచ్చిన వారికి ఇచ్చే బహుమతి కాదు.. ప్రభుత్వ సేవలో ఉత్తమంగా పనిచేసిన వారికి ఇచ్చే గుర్తింపు. అందుకే ఎంపికలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావులేకుండా, పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

వరుసగా ఒకే వ్యక్తులకు గుర్తింపు లభిస్తుండటంపై వస్తున్న ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ప్రశంసా పత్రాల ఎంపికకు ఏ ప్రమాణాలు పాటిస్తున్నారు? గతంలో ప్రశంసా పత్రాలు పొందిన వారి వివరాలు ఏమిటి? ఈసారి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు కోరుతున్నారు.

లేనిపక్షంలో ఎంత అంకితభావంతో పనిచేసినా గుర్తింపు దక్కదు.. అధికారులు అనుకున్న వారికే ప్రశంసలు అనే భావన ఉద్యోగుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.