ఉట్నూర్‌లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

శివాలయంలో ప్రత్యేక పూజలు.. నాగదేవతకు పాలు, నైవేద్యాల సమర్పణ

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని రామాలయంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. శివాలయంలో శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. శివుడు, నాగోబా దర్శనం కోసం భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆలయంలో పూజారి సంతోష్ దూబే పూజలు, హారతులు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.

ఉట్నూర్ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ నాగుల పంచమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామాల్లోని నాగుల పుట్టల వద్దకు చేరుకున్న మహిళలు, భక్తులు నాగదేవతకు పాలు పోసి, ప్రసాదాలు సమర్పించారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని నాగదేవతను వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.