కడెంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

నాగదేవతకు ప్రత్యేక పూజలు.. పుట్టలో పాలు పోసిన మహిళా భక్తులు

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండల కేంద్రంలోని నాగదేవత ఆలయంలో సోమవారం నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందున్న నాగుల పుట్టలో పాలు పోసి, జొన్న పాలు, పుట్నాలు, నైవేద్యాలను సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని నాగదేవతను వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నాగుల పంచమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కడెం మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగదేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.