ఏఎస్ఆర్ ఎయిర్ పోర్టులో తొలి వాణిజ్య విమాన సేవలు షురూ..

జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు


భోగాపురం(విజయనగరం): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర విమానయాన శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు.

ప్రయాణీకులకు బోర్డింగ్ పాస్ లను కేంద్ర మంత్రి తన చేతుల మీదుగా అందజేసారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి షెడ్యూల్డ్ ఫ్లైట్ గా హైదరాబాద్ నుంచి ఇండిగో 6E6408 విమానం చేరుకుంది. కొత్త ఎయిర్‌పోర్ట్‌లో తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్‌గా ఇండిగో నిలిచింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ప్రయాణికులకు స్వాగతం పలికారు.

ఎయిర్ పోర్టు గొప్పగా ఉందంటూ ప్రయాణీకులు ప్రశంశలు కురిపించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ముద్ర అతి త్వరలో చెరిగిపోనుందన్నారు. విశాఖ నుంచి కనెక్టివిటీ సమస్యను అధిగమించేందుకు బీచ్ కారిడార్ కూడా దోహదపడుతుందని, ఆమేరకు కృషి జరుగుతుందన్నారు. ఇప్పటికే సింహాచలం మీదుగా రహదారులను విస్తరించడం జరిగిందన్నారు. తొలినాళ్లలో చిన్న పాటి ఇబ్బందులున్నా క్రమంగా అవి సమసిపోతాయన్నారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు.