ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.. మరో విద్యార్థికి చికిత్స
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: వరుస ప్రమాద ఘటనలతో పశ్చిమగోదావరి జిల్లా ఉలిక్కిపడుతుంది. ఇటీవల పాలకోడేరు మండలం వేండ్ర లోని గోస్తని వేల్పూర్ కాలవలోకి ఓ ప్రేమ జంట దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా యువతి మృతి చెందింది. యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మరవక ముందే తాజాగా సోమవారం ఇదే కాలవలోకి స్నానానికి దిగిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ సంఘటన సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరంలోని ఎస్ ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం కావడంతో సరదాగా స్నానం చేసేందుకు మధ్యాహ్నం లోని వేండ్ర లోని గోస్తని -వేల్పూరు కాల వద్దకు వచ్చారు. వంతెన పై భాగంలో ఉన్న వైర్ ప్రాంతం వద్ద ఇద్దరు విద్యార్థులు స్నానానికి దూకడంతో వారు నీటి ప్రవాహానికి మునిగిపోయారు. వీరిని రక్షించే క్రమంలో పల్నాడు జిల్లా గురజాల కు చెందిన ఎస్.సాయి కాలువలకు దూకాడు. ఇతను కూడా మునిగిపోతున్న సమయంలో అతి కష్టం మీద మిగిలిన ముగ్గురు స్నేహితులు కర్ర సాయంతో అతన్ని ఒడ్డుకు లాక్కొచ్చారు. ఇతన్ని చికిత్స నిమిత్తం భీమవరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
కాలువలో స్నానానికి కాలువలోకి దూకిన భీమవరంలోని గునుపూడి ప్రాంతానికి చెందిన పెరుమళ్ళ సత్య భాస్కర విగ్నేష్ (21), విజయనగరం జిల్లా పార్వతిపురానికి చెందిన ఎస్.రాహుల్ (21) గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు విషయాన్ని అగ్నిమాపక శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. వీరి ఇరువురు కాలువలో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
