పోలీస్‌ శాఖలో 150 పోస్టులు.. అర్హతలు ఇవే !

ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగంలో 150 ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్పీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ సిబ్బంది, రిటైర్డ్‌ పోలీసు సిబ్బంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి..

మాజీ సైనికుల వయస్సు 2026 ఆగస్టు 31 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. మాజీ పారామిలటరీ సిబ్బంది, రిటైర్డ్‌ పోలీసు సిబ్బంది ఉద్యోగ విరమణ చేసి రెండేళ్లలోపు ఉండాలి. వీరికి గరిష్ట వయోపరిమితి 62 సంవత్సరాలు. ఎంపికైన ఎస్పీఓలకు నెలకు రూ.26,000 గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు వేతనంతో కూడిన సెలవులు ఉండవు. సెలవు తీసుకుంటే ఆ కాలానికి గౌరవ వేతనం చెల్లించరు.

సమర్పించాల్సిన పత్రాలు..

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఒరిజినల్‌ పత్రాలతోపాటు వాటి జిరాక్స్‌ ప్రతులను సమర్పించాలి. డిశ్చార్జ్‌ బుక్‌, డిశ్చార్జ్‌ సర్టిఫికేట్‌ లేదా పదవీ విరమణ ఉత్తర్వు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఎస్‌బీఐ పాస్‌బుక్‌, ఓటరు గుర్తింపు కార్డు, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. వర్తించే అభ్యర్థులు సాంకేతిక వృత్తి నైపుణ్య ధ్రువీకరణ పత్రాలను కూడా ఇవ్వాలి. డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చెల్లుబాటయ్యే తేలికపాటి లేదా భారీ వాహనాల డ్రైవింగ్‌ లైసెన్స్‌ సమర్పించాలి. అలాగే మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఇవ్వాలి.

దరఖాస్తు ఎక్కడ.. ఎప్పటిలోగా?

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హైదరాబాద్‌ పెట్లబుర్జ్‌లోని సీఏఆర్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఎస్పీఓ కార్యాలయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు సమర్పించాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 25, 2026 సాయంత్రం 5 గంటలు.

గడువు ముగిసిన తర్వాత అందే దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.