ఒక్క సీసీ కెమెరా ఎంతో భద్రత: ఎస్సై కొమురయ్య
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: గ్రామంలో ఒక్క సీసీ కెమెరా ఎంతోమంది పోలీసులతో సమానమని, తద్వారా ఎంతో భద్రత ఉంటుందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) ఎస్సై కొమురయ్య అన్నారు. ఆదివారం మండలంలోని పుల్లార పంచాయతీ పరిధిలోని దేవుడుపెల్లిలో సౌర విద్యుత్ వ్యవస్థతో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం గ్రామస్తులతో ఎస్సై మాట్లాడుతూ.. పంచాయతీ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో నేరాలను అదుపు చేయవచ్చని అన్నారు.
కొత్త వ్యక్తులు గ్రామంలోకి వచ్చినప్పుడు అనుమానితులను గుర్తించడంతోపాటు దొంగలను పట్టుకోవడం సీసీ కెమెరాల ద్వారా సులభంగా ఉంటుందని ఎస్సై కొమురయ్య పేర్కొన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలు, ఇతర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పుల్లార సర్పంచ్ వెడ్మ జంగుబాయి, ఉప సర్పంచ్ పూర్ణ రాజేష్, సిర్పూర్ (యు) ఏఎస్సై గంగారం, పోలీసులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
