నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం
- చికిత్స పొందుతూ యువకుడి మృతి
- యువకుడి మృతిపై కుటుంబ సభ్యుల ఆరోపణలు
- సమయానికి వైద్యం అందలేదని తల్లిదండ్రుల ఆవేదన
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు
- ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యతారాహిత్యంపై అనుమానాలు
- సమగ్ర విచారణకు డిమాండ్
ఆంధ్రప్రభ, ఏలూరు: నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పితో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమంటూ ఆరోపించడంతో ఆసుపత్రి వర్గాల పని తీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నూజివీడు మండలం బోరవంచ గ్రామానికి చెందిన రామకూరి ప్రేమ్‌బాబు (32) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. శనివారం కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించినట్లు అతని తల్లి తెలిపారు. అయితే ఆసుపత్రిలో చేరిన అనంతరం తన కుమారుడికి సకాలంలో తగిన వైద్యం అందలేదని, అందుకు సంబంధించిన డాక్టర్లు కూడా అందుబాటులో లేరని, పరిస్థితి విషమించినప్పటికీ వైద్యులు అందుబాటులోకి రాలేదని, నైట్ డ్యూటీ చేస్తున్న నర్స్ కేవలం రెండు సరైన మాత్రమే ఎక్కించారని మూత్రం విసర్జించలేక ఇబ్బంది పడుతున్నాడంటూ పలుమార్లు నర్స్ కి తెలిపినప్పటికీ డాక్టర్లకు గాని, సూపరిండెంట్ గాని, ఫోన్ చేసి వివరాలు తెలుపలేదని ఆమె ఆరోపించారు. చివరకు ఆదివారం తెల్లవారుజామున ప్రేమ్‌బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
‘‘సకాలంలో వైద్యం అందించి ఉంటే మా కుమారుడు బతికేవాడు’’ అంటూ మృతుడి తల్లిదండ్రులు రోదించడం ఆసుపత్రి ప్రాంగణంలో విషాదాన్ని నింపింది. మృతుడి తల్లి ఆశా కార్యకర్తగా పనిచేస్తుండటం, వైద్య సేవల ప్రాధాన్యత తనకు తెలుసని చెబుతూ, డ్యూటీలో ఉండవలసిన డాక్టర్లు ఉన్నారా లేరా అన్న విషయాన్ని పరిశీలించవలసిన సూపరిండెంట్ సైతం తమ కొడుకు విషయంలో పూర్తి బాధ్యత రాహిత్యంగా సూపర్నెంట్ పద్మజారాణి, డ్యూటీ డాక్టర్లు వ్యవహరించారని తన కుమారుడికి సకాలంలో వైద్యం అందకపోవడం బాధాకరమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఘటనల నేపథ్యంలో మళ్లీ ప్రశ్నలు..
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలోనూ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణీ మృతి చెందిన ఘటనపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రిలో వైద్యుల అందుబాటు, అత్యవసర వైద్య సేవలు, డ్యూటీ వైద్యుల విధుల నిర్వహణపై ప్రజల్లో చర్చ మొదలైంది. అయితే ప్రేమ్‌బాబు మృతి నిజంగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందా? లేక ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్య తీవ్రత కారణంగానే మృతి సంభవించిందా? అనే విషయాన్ని అధికారిక వైద్య విచారణ ద్వారా తేల్చాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
సూపరింటెండెంట్ పర్యవేక్షణపై ప్రశ్నలు..
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల విధుల నిర్వహణ, డ్యూటీ డాక్టర్ల అందుబాటు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చికిత్స అందుతున్నదా లేదా అనే అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవలసిన బాధ్యత ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజారాణి విధుల నిర్వహణ, ఆసుపత్రిలో డ్యూటీ వైద్యుల హాజరు, అత్యవసర విభాగం పనితీరుపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
డ్యూటీ డాక్టర్ విధుల్లో ఉన్నారా? ఉంటే ప్రేమ్‌బాబుకు ఎప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించారు? ఏ చికిత్స అందించారు? ఆయన పరిస్థితి ఎప్పుడు విషమించింది? మెరుగైన వైద్యం కోసం మరొక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం జరిగిందా? వంటి అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. డ్యూటీ వైద్యుల హాజరు రిజిస్టర్, చికిత్స వివరాలు, కేస్ షీట్, వైద్య పరీక్షల నివేదికలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం పోవడానికి బాధ్యులు ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లోనూ వినిపిస్తోంది. కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆరోపణల్లో వాస్తవం లేకపోతే వైద్యపరమైన కారణాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి స్వతంత్రంగా సమగ్ర విచారణ నిర్వహించి, ప్రేమ్‌బాబు మృతికి అసలు కారణాలను వెల్లడించడంతో పాటు బాధ్యులను గుర్తించి వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 24 గంటలూ వైద్యుల అందుబాటు, అత్యవసర వైద్య సేవలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ప్రేమ్ బాబు మరణానికి కారణమైన పరిస్థితులపై విచారణ జరిపి ఏ విధమైన చర్యలు ఎంత తొందరగా తీసుకుంటారనేది వేచి చూడాల్సింది.

