Vishwanath And Sons Collections | దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన రెండు రోజులకే భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్‌ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.

దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబంతో కలిసి సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌ కుమార్‌ పాత్రల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా కథాంశం కొత్తగా ఉండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీనా టాండన్, నాజర్, సుధ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించగా.. నిమిష్‌ రవి ఛాయాగ్రహణం, నవీన్‌ నూలి కూర్పు బాధ్యతలు చేపట్టారు.

సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగా కలెక్షన్లు కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు ట్రేడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ వసూళ్లు సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్‌ను మరోసారి తెలియజేస్తున్నాయి.

ఇక ‘లక్కీ భాస్కర్‌’, ‘సార్‌’ వంటి చిత్రాలతో విజయాలు అందుకున్న వెంకీ అట్లూరి.. మరోసారి కుటుంబ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్‌ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో చూడాలి.