మేడారంలో వనదేవతలకు సీఎం ప్రత్యేక పూజలు..

చేయూత పింఛన్ల చెక్కుల పంపిణీ, వాటర్ ప్లాంట్ ప్రారంభం
మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ముచ్చట


వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలోని ప్రముఖ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో పర్యటించారు. బిచ్కుంద నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు సాంప్రదాయ డోలు వాయిద్యాలు, గిరిజన సంప్రదాయాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. మేడారంలోని వనదేవతలు సమ్మక్క–సారలమ్మల గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను ప్రార్థించారు. తన మొక్కులలో భాగంగా వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు.

24మంది మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ..
గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 24మంది వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత సామాజిక భద్రత పింఛన్లను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.2,016 చొప్పున అందించే పింఛన్లకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

వాటర్ ప్లాంట్ ప్రారంభం…
మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.

మహిళా సంఘాల సభ్యులతో సీఎం ముచ్చట..
అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు, వారి ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం ముఖ్యమంత్రి మేడారం నుంచి ములుగుకు తిరుగుపయనమయ్యారు.

ఈ పర్యటనలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, సెర్ఫ్ సీఈఓ దివ్య, మేడారం ఈఓ వీరస్వామి, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.