38 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన గురు–శిష్యులు..
భూత్పూర్, ఆంధ్రప్రభ : నాలుగు దశాబ్దాలకు చేరువైన కాలం తర్వాత నాటి గురువులు, శిష్యులు ఒకే వేదికపై కలుసుకున్నారు. దీంతో భూత్పూర్లోని పంచవటి కన్వెన్షన్ హాల్ ఆదివారం మధుర జ్ఞాపకాలకు వేదికగా మారింది. 1987–88 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సీ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తరగతి గదిలో జరిగిన సరదా సంఘటనలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు, గురువుల మందలింపులు, వారు అందించిన ప్రోత్సాహం, పాఠశాల రోజుల అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. వయసు పెరిగినా నాటి స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదని ఈ కలయిక చాటిచెప్పింది.
ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు యెల్ల స్వామి, జైదు శంకరయ్య, జయశంకర్, సుభాష్ బాబు, అంజనేయులు, శ్యామల, ప్రమీల తదితరులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి గురువులు అందించిన విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు, మార్గదర్శకత్వం ఎంతో దోహదపడ్డాయని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.
గురువులు తమ జీవితాలకు దిశానిర్దేశం చేసిన మార్గదర్శకులని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ‘గురువుల బోధనలు.. జీవితానికి మార్గదర్శకాలు’ అనే సందేశంతో సాగిన ఈ సమ్మేళనం గురు–శిష్యుల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధానికి అద్దం పట్టింది. 38 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఆత్మీయ కలయికలో ఆనందం, ఆత్మీయత, భావోద్వేగం కలగలిసి ప్రత్యేక వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జైదు విజయ్‌కుమార్, గోవర్ధన్ గౌడ్, బాలవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
