Chandragiri | పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
తిరుపతి, ఆంధ్రప్రభ: చంద్రగిరి సమీపంలోని ఎర్రవారిపాలెం ప్రాంతంలో ఏనుగుల గుంపులు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటి సంచార మార్గాలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం అందడంతో పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏనుగుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిఘా పెట్టాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ పెంచాలని సూచించారు. అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు. గ్రామాల్లో మైకులు, మొబైల్ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో హనుమాన్ బృందాలను మోహరించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో పంట నష్టంపై అధికారులు నివేదికలు సిద్ధం చేసిన వెంటనే అటవీశాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అటవీశాఖ అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
