ప్రపంచానికి నాట్యం నేర్పింది మన కూచిపూడి..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కూచిపూడి నృత్యానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించడం భారతీయులందరికీ గర్వకారణమని మచిలీపట్నం సాహితీ మిత్రుల అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అన్నారు. ఈడేపల్లి ప్రసన్నాంజనేయ ఆలయ కళావేదికలో శ్రీ బాలా త్రిపుర సుందరి నృత్య నికేతన్ 40వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలాజీ మాట్లాడుతూ.. కూచిపూడి నృత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కూచిపూడి నృత్యానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో తెలుగు వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

నృత్య నికేతన్ ద్వారా గత 40 ఏళ్లుగా వేలాది మంది కూచిపూడి నేర్చుకుని దేశ, విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం మచిలీపట్నానికి గర్వకారణమన్నారు. పిల్లలను సంప్రదాయ కళలకు దగ్గర చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. నాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు డా. శివలెంక ఉషాకిరణ్, మృదంగ విద్వాంసుడు చింతా సూర్యప్రకాశ్, సంగీత విద్వాంసుడు తారాకుటూరి శ్రీనివాసరావును సంస్థ ఘనంగా సత్కరించింది. నాట్యాచార్యుడు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు, ఆయన సతీమణి నాగలక్ష్మిని నాట్య కళాకారులు సన్మానించారు. నృత్య నికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి.