రింగ్‌ రోడ్డు పేరుతో పంట భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోం

అభివృద్ధి పేరుతో విధ్వంసం.. రైతుల భూముల జోలికొస్తే పోరాటం

మధిర, ఆంధ్రప్రభ: మధిరలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పేరుతో రైతుల పంట భూములను బలవంతంగా తీసుకుంటే సహించేది లేదని జడ్పీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమల్‌రాజ్‌ హెచ్చరించారు. మధిరలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో విధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. మధిర పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో సామాన్యుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, రోడ్డుకు దగ్గరగా ఉన్న కాంగ్రెస్‌ కార్యాలయాన్ని మాత్రం ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం రెండు పంటలు పండే సుమారు 260 ఎకరాల భూమిని రైతులను భయపెట్టి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం రూ.193 కోట్లు కేటాయించడంతో పాటు టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయిందని ఆయన ఆరోపించారు.

రింగ్‌ రోడ్డు పూర్తయితే మధిరలో వ్యాపార, వాణిజ్య సంస్థలు దెబ్బతింటాయని కమల్‌రాజ్‌ అన్నారు. రైతుల భూములను అతి తక్కువ ధరలకు తీసుకుంటే బీఆర్‌ఎస్‌ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎందుకోసం నిర్మిస్తున్నారో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంటే సిరిపురం–మధిర, దెందుకూరు–మధిర, రాయపట్నం–మధిర మార్గాల్లో డివైడర్లు, మధ్యలో వెలుగుల ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ పాలనలోనే మధిరలో వంద పడకల ఆసుపత్రి, సమీకృత మార్కెట్‌, మధ్యలో వెలుగుల ఏర్పాటు, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రావూరి శ్రీనివాసరావు, చిత్తారి నాగేశ్వరరావు, రంగశెట్టి కోటేశ్వరరావు, బిక్కీ ప్రసాద్‌, వైవీ అప్పారావు, చావా వేణు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, పరిశా శ్రీనివాసరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.