సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

శనివారం వేటకు వెళ్లి గల్లంతు..
ఆదివారం ఉదయం మృతదేహం లభించడంతో విషాదం

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు పల్లేటి రాజు మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. తాళ్లపాలెం వైఎస్సార్‌ ఫిషర్‌మెన్‌ పాకాల కాలనీకి చెందిన రాజు శనివారం ఉదయం సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతయ్యారు. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం నుంచి రాజు ఆచూకీ కోసం గాలింపు కొనసాగించగా.. ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని రాజు మృతదేహాన్ని సందర్శించారు. రాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మత్స్యకారుడి మృతితో తాళ్లపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.