మరికొద్ది గంటల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభం..

పూలతోరణాలు, విద్యుత్‌ అలంకరణలతో ముస్తాబు
సభా ప్రాంగణం, పార్కింగ్‌, తాగునీరు, భద్రతా ఏర్పాట్లు పూర్తి

ములుగు, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం ఆదివారం ములుగు పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

పూలతోరణాలతో ప్రత్యేక అలంకరణ

ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నూతన కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని బంతిపూల తోరణాలు, వివిధ రకాల పుష్పాలు, రంగురంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. కలెక్టరేట్‌ పరిసరాల్లో ప్రత్యేక సుందరీకరణ పనులు చేపట్టి ఆకట్టుకునేలా ముస్తాబు చేశారు.

ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాలను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తొలుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క ఇప్పటికే వెల్లడించారు.

సభా ప్రాంగణంలో పకడ్బందీ ఏర్పాట్లు

కలెక్టరేట్‌ ఆవరణలో ముఖ్యమంత్రి ప్రసంగించేందుకు ప్రత్యేక సభా వేదికను ఏర్పాటు చేశారు. అతిథులు, ప్రజలు కూర్చునేందుకు కుర్చీలను సిద్ధం చేయడంతో పాటు ఆధునిక ధ్వని వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడింగ్‌, పార్కింగ్‌, తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, రహదారులు తదితర మౌలిక సదుపాయాలను అధికారులు సిద్ధం చేశారు.

భద్రతకు ప్రత్యేక చర్యలు

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్‌ పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకలు, ప్రజల ప్రవేశం, అతిథుల రాక తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ములుగు పరిపాలనకు కొత్త చిరునామా

రూ.63.50 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ములుగు జిల్లా పరిపాలనకు కొత్త చిరునామాగా నిలవనుంది. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది. సీఎం పర్యటనలో భాగంగా ములుగులో రూ.868 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అధికారులు పనులను వేగవంతం చేశారు. దీంతో సీఎం రాక కోసం ములుగు నూతన కలెక్టరేట్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది