తీజ్‌ పండుగ క్యాసెట్‌ పోస్టర్లు విడుదల

ఎమ్మెల్యే కోవలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరణ..
బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా పాటల రూపకల్పన

జైనూర్‌, ఆంధ్రప్రభ : బంజారా సమాజం సంప్రదాయంగా నిర్వహించుకునే తీజ్‌ పండుగను పురస్కరించుకుని రూపొందించిన పాటల క్యాసెట్‌ పోస్టర్లను ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవలక్ష్మి చేతుల మీదుగా విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి సారథి కళాకారుడు, రచయిత పవార్‌ మోహన్‌ నాయక్‌ ఈ పాటలను రూపొందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా పాటలు రూపొందించడం అభినందనీయమన్నారు. సంప్రదాయ కళలను కాపాడటంతో పాటు వాటిని నేటి తరానికి చేరువ చేసేందుకు కళాకారులు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.

కళాకారుడు, రచయిత పవార్‌ మోహన్‌ నాయక్‌ మాట్లాడుతూ.. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలపై ప్రతి ఏడాది వినూత్న రీతిలో పాటలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువతకు బంజారాల పండుగలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేలా పాటలను వీడియో రూపంలోనూ రూపొందిస్తున్నామని చెప్పారు.

తీజ్‌ పండుగ ప్రత్యేకతను, బంజారా సంస్కృతిలో దాని ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈసారి పాటలను రూపొందించినట్లు మోహన్‌ నాయక్‌ తెలిపారు.