కుబీర్‌ మండలంలో స్వాతంత్య్ర వేడుకలు

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దేశభక్తి కార్యక్రమాలు
జాతీయ నాయకుల వేషధారణతో ఆకట్టుకున్న విద్యార్థులు

కుబీర్‌, ఆంధ్రప్రభ : కుబీర్‌ మండలంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీదేవి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో భూమేష్‌, పీహెచ్‌సీలో వైద్యాధికారి డాక్టర్‌ విజేష్‌, రైతువేదికలో ఏవో సారిక, ఏఎంసీ మార్కెట్‌ కార్యాలయంలో చైర్మన్‌ గోనె కళ్యాణ్‌, సహకార సంఘంలో చైర్మన్‌ రేకుల గంగాచరణ్‌, విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ విజయ్‌కుమార్‌, విద్యుత్‌ ఉపకేంద్రంలో ఏఈ కదం ఆదిత్య, ఉపాధి హామీ కేంద్రంలో ఏపీ హరిలాల్‌, మండల సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షురాలు లక్ష్మి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, కుల సంఘాలు, యువజన సంఘాల అధ్యక్షులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.