అస్థికల నిమజ్జనానికి వచ్చి నదిలో మునిగి మృతి..
బాసర, ఆంధ్రప్రభ: తాత అస్థికల నిమజ్జనానికి బాసర గోదావరి నదికి వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. బాసర స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన శ్రీవత్స క్రిష్ తాత శుక్రవారం మృతి చెందాడు. తాత అంత్యక్రియలు పూర్తిచేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అస్థికలను నదిలో నిమజ్జనం చేసేందుకు బాసర గోదావరి నది వద్దకు వచ్చారు.
అస్థికలను నిమజ్జనం చేస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి శ్రీవత్స క్రిష్ గోదావరి నదిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టి శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ దీపక్ తెలిపారు.
