ఖానాపూర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ అంకం మౌనిక, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాధా రాథోడ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుజాత, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ స్వర్ణరెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రాహుల్ గైక్వాడ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఖానాపూర్ ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు గాండ్ల రాజశేఖర్, సీనియర్ ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు పడాల లక్ష్మీనారాయణ జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కుల సంఘాల ఆధ్వర్యంలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, యువజన, స్వచ్ఛంద సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
