విద్యార్థుల దాహం తీర్చిన సర్పంచ్‌

ప్రభుత్వ పాఠశాలలకు ప్రతిరోజూ మినరల్‌ వాటర్‌ సౌకర్యం
బడుల బలోపేతానికి బైకాని రాజు ప్రత్యేక చొరవ
సర్పంచ్‌ సేవలపై విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్‌ బైకాని రాజు మినరల్‌ వాటర్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆయన ఇకపై ప్రతిరోజూ పాఠశాలలకు మినరల్‌ వాటర్‌ అందేలా చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సర్పంచ్‌ బైకాని రాజు చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. గ్రామంలోని విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లకుండా తల్లిదండ్రులను స్వయంగా ఒప్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.

అందులో భాగంగానే విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మినరల్‌ వాటర్‌ సౌకర్యం కల్పించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్‌ బైకాని రాజు ఆకాంక్షించారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సర్పంచ్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని గ్రామస్తులు కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.