అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో వికసిత్ భారత్
వికసిత్ ఏపీ దిశగా పయనం: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ (ఆంధ్రప్రభ): విజయవాడ ఎన్టీఆర్ భవన్లో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర్య ఫలితాన్ని నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు మేలు చేకూరేలా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. ‘2047 వికసిత్ భారత్–వికసిత్ ఏపీ’ లక్ష్యంగా రాష్ట్రం ముందుకు సాగుతున్న అభివృద్ధి ప్రయాణంలో ప్రజలందరి సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు.
