ఇంద్రకీలాద్రిపై ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
జాతీయ పతాకావిష్కరణ చేసి వార్షిక ప్రగతి నివేదిక సమర్పించిన ఈవో వి.కె.శీనా నాయక్
విజయవాడ, ఆగస్టు 15( ఆంధ్రప్రభ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ రాజగోపురం ప్రాంగణంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, దేవస్థానం గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ వార్షిక ప్రగతి నివేదికను సమర్పించారు.
భక్తుల సంతృప్తిలో అగ్రస్థానం..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేల్లో భక్తుల సంతృప్తి స్థాయిలో దేవస్థానం ప్రథమ స్థానంలో నిలిచిందని ఈవో శీనా నాయక్ తెలిపారు. రథం సెంటర్‌లో గత పదేళ్లుగా ఆక్రమణలో ఉన్న దేవస్థానం స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ భక్తుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దసరా మహోత్సవాల్లో 18 లక్షల మందికి పైగా భక్తులకు విస్తృత వసతులు కల్పించామని తెలిపారు. గత దశాబ్ద కాలంలోనే అత్యధికంగా ఆషాఢ మాసంలో 6 లక్షలకు పైగా భక్తులు సారె సమర్పించారని పేర్కొన్నారు. 250 మందికి పైగా చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
అభివృద్ధి పనులు.. డిజిటల్ సేవలు
నూతన లడ్డూ పోటు భవనం, నూతన అన్నప్రసాద భవనం నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని ఈవో శీనా నాయక్ వివరించారు. పవిత్ర కృష్ణానది హారతుల కోసం శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ సేవలు, కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

సామాన్య భక్తుడికి మెరుగైన సేవలే లక్ష్యం: చైర్మన్..
దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సహకారంతో ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
50మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు..
విధుల్లో విశేష ప్రతిభ, అంకితభావం కనబరిచిన దేవస్థానంలోని వివిధ విభాగాలకు చెందిన 50 మంది సిబ్బందికి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ ప్రోత్సాహక ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రశంసా పత్రాలు పొందిన వారిలో అర్చకులు, కార్యాలయ సిబ్బంది, ఇంజనీరింగ్, భద్రత, పారిశుద్ధ్యం, కేశఖండనశాల, వేద పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ, విజయవాడ విద్యార్థులు నృత్యాచార్యులు సప్పశివకుమార్ ఆధ్వర్యంలో కళా ప్రదర్శన నిర్వహించారు. సంప్రదాయ పాఠశాల, గాంధీనగర్ విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకల్లో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, టి. హరికృష్ణ, టి. రమాదేవి, ఎస్. సరిత, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్, పరిపాలనా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
