స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఘన సన్మానం
కర్నూలు ప్రతినిధి (ఆంధ్రప్రభ): దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర పరిశ్రమలు, ఆహార శుద్ధి, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. జాతీయ పతాకావిష్కరణ, జెండా వందనం అనంతరం మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను దుశ్శాలువలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను గౌరవించడం ద్వారా వారి త్యాగాలను భావితరాలకు గుర్తుచేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
10 కుటుంబాలకు గౌరవం
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు చెందిన 10 మందిని మంత్రి, అధికారులు ఘనంగా సన్మానించారు. గుర్రం వెంకటరెడ్డి కుమారుడు గుర్రం జైపాల్‌రెడ్డి, సర్దార్ బుచ్చిబాబు భార్య ఎస్. ఉమాదేవి, జి. సత్యనారాయణ భార్య జి. సుబ్బమ్మ, ఎం.సి. శుభకర్ భార్య ఎం.సి. ఎంకమ్మ, ఎస్.డి. నారాయణరావు కుమారుడు ఎస్.డి. నరేంద్ర ప్రసాద్, డి. చెన్నయ్య కుమారుడు డి. రాధాకృష్ణమూర్తి, ఎస్.ఎం.కె. బియాబాని కుమారుడు ఎస్.ఐ. భాష బియాబాని, కల్నల్ ఐ.ఎస్. సయీద్, తుక్కోజీరావు కుమారుడు కే. చంద్రకాంత్, విష్ణువర్ధన్‌లను సత్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను గౌరవించడం ద్వారా దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను మరోసారి స్మరించుకున్నట్లయిందని అధికారులు పేర్కొన్నారు.
