వర్షంలోనూ జెండా పండుగ.. చాటిన దేశభక్తి

మహాముత్తారం, ఆంధ్రప్రభ : మహాముత్తారం మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వేడుకల్లో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రజలు కార్యక్రమాలకు హాజరయ్యారు.

మండల కేంద్రంలో ఎంపీడీవో చల్లా ప్రకాశ్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ దండు శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచి కొండగోర్ల బాపు జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ గొర్ల రమేష్ జెండాను ఆవిష్కరించి అభివందనం చేశారు. పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్ సోమ శాంతికుమార్‌గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఇటీవల ‘బెస్ట్‌ సర్వీస్‌ సొసైటీ’ చైర్మన్‌గా జాతీయ పురస్కారం అందుకున్న సోమ శాంతికుమార్‌గౌడ్‌ను మహిళలు, పీఏసీఎస్‌ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేసి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

గ్రామాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ సమైక్యతను చాటారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మండల వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది, పీఏసీఎస్‌ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.