అమరవీరుల త్యాగాలు వృథా కావు

స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాల సాధనకు కృషి చేయాలి: సర్పంచ్‌ రంగారెడ్డి
గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

వేంసూరు, ఆంధ్రప్రభ : వైఎస్‌ బంజర గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ కణమతరెడ్డి రంగారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపై నిర్మితమైన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలు నేటి తరానికి ఆదర్శప్రాయమని, వారి దేశభక్తి, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.