స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత

బంటుమిల్లి (ఆంధ్రప్రభ): బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం ఎంతో మంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా బంటుమిల్లి బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రయాణించారు. గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాదిలోనే విశేష ఆదరణ పొందిందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సగటున రూ.8.53 కోట్ల సబ్సిడీ భరిస్తోందని, ఇప్పటివరకు ఈ పథకం కోసం రూ.3,095 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సుల్లో ‘స్త్రీ శక్తి’ పథకం అమలవుతోందన్నారు. పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతం ఉండగా, పథకం అమల్లోకి వచ్చిన తర్వాత 62 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం తదితర అవసరాల కోసం సులభంగా రాకపోకలు సాగించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకం ఎంతో దోహదపడుతోందన్నారు. ప్రజారవాణా వినియోగం పెరగడం ద్వారా మహిళలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటం తగ్గి, బస్సు ప్రయాణాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.