జల వనరుల శాఖలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

కర్నూలు రూరల్ బ్యూరో, (ఆంధ్రప్రభ): కర్నూలులోని జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.ఎం. కిరణ్‌కుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం ద్వారా సాధించిన స్వేచ్ఛను కాపాడుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు.

జల వనరుల శాఖకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఉన్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కాలువల పర్యవేక్షణ, రైతులకు సాగునీటి అందుబాటు, నీటి వనరుల సమర్థ వినియోగం వంటి అంశాల్లో సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కమలాకరరావు, స్టెనో జి. వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది హైమావతి, గీత, నీరజ, సుబ్బారెడ్డి, సురేంద్ర, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.