గీత‌ కార్మికుల అన్నీ సమస్యలు పరిష్కరించాలి..

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ

జన్నారం, ఆంధ్రప్రభ : గీత కార్మికుల అపరిస్కృతంగా ఉన్న అన్నీ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కల్లు గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల రమణ అన్నారు. గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలన్నారు.

ప్రభుత్వ జీవో ప్రకారం 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులందరికీ రూ.4వేల పెన్షన్ ఇస్తూ, ప్రమాదాలకు గురైన గీత కార్మికులందరికీ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న రూ. 20 కోట్ల ఎక్స్గ్రేషియా డబ్బులను బాధితులకు వెంటనే అందజేయాలని ఆయన కోరారు. గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ. 67 కోట్లను, కల్లు నీరాకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ. 25 కోట్ల డబ్బులను విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.

ముందుగా కవ్వాలలో స్వర్గీయ పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆ తర్వాత మండల కేంద్రంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాములు,జిల్లా అధ్యక్షుడు కాసారపు లచ్చా గౌడ్,మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలస్వామి శ్రీనివాస్ గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు మూల భాస్కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోడేటి రవిగౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు కాసారపు పోచా గౌడ్, రమేష్ గౌడ్, బాలగౌడ్, పరకాల తిరుపతి గౌడ్, మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.