ముదిగొండ పీహెచ్‌సీకి తాళాలు..

రోగుల అవస్థలు

12 గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సి ఉన్నా ముందుగానే తాళాలు
వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేక ఆస్పత్రి బయటే రోగుల నిరీక్షణ
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

ముదిగొండ, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): ముదిగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) సిబ్బంది తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండాల్సి ఉన్నప్పటికీ, సిబ్బంది ముందుగానే ఆస్పత్రికి తాళాలు వేసి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు.

నిర్ణీత సమయానికి ముందే తాళాలు
మధ్యాహ్నం 12 గంటలు కాకముందే ఆరోగ్య కేంద్రం తలుపులకు తాళాలు వేసి సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఆస్పత్రి బయటే రోగుల నిరీక్షణ
వివిధ అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నొప్పులతో బాధపడుతున్న కొందరు రోగులు ఆస్పత్రి బయట మెట్లపై కూర్చొని నిరీక్షించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా సిబ్బంది ముందుగానే వెళ్లిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.