త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నివాళులర్పించారు. అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పాతుకుల శ్రీశైలం, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
