భూత్పూర్ మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భూత్పూర్ (ఆంధ్రప్రభ): భూత్పూర్ మండల వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. యువజన, మహిళా, కుల సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనూ కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం విద్యార్థులు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. భూత్పూర్ మున్సిపల్ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

భూత్పూర్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కిషన్, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై నాగన్న, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఉమాదేవి జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రాథమిక రైతు సేవా సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ కదిరే అశోక్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ఎంఈఓ ఉషారాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.